దేవతల కాలం నుంచి నేటి ఆధునికయుగం వరకు విశిష్ట చరిత్ర గల వంశం పద్మశాలీయులది. ఇతిహాసాల ఆధారంగా సృష్టికర్త బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలలో ఒకరైన భృగు మహర్షి కుమారుని కుమారుడగు మార్కండేయుని వంశపరంపరగా కలియుగంలో వర్ధిల్లుతున్న పద్మశాలీయుల చరిత్ర ఎంతో ఘనమైనది. మాన రక్షకులుగా ఆనాడు దేవతలకు ఈనాటి మానవజాతికి యుగయుగాలుగా వస్త్ర నిర్మాణం చేస్తున్న ఘనకీర్తి ఉన్నది. చరిత్ర సాక్ష్యాలుగా ఎన్నో ఆధారాలతో వ్యవహరింపబడుతున్న పద్మశాలి వంశం భారతదేశంలో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ, వృత్తిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ కవులుగా, కళాకారులుగా, మేథావులుగా, విజ్ఞానవంతులుగా వెలుగుందుతూ పద్మశాలీయులు అనాదిగా అభినందనీయులుగానే వ్యవహరింపబడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రతిభ ప్రదర్శింపబడుతూనే ఉంది.
నేటి ఆధునిక యుగంలో
నేటి ఆధునిక యుగంలో వస్త్ర పరిశ్రమ యాంత్రిక మార్గంలోకి వెళ్ళడంతో చేనేత పరిశ్రమ దెబ్బతింది. కులవృత్తి కాస్తా కూడు పెట్టలేని దశకు చేరుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడింది. గిట్టుబాటు లేని స్థితికి నెట్టబడింది. పద్మశాలీయుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఆకలిచావులు, ఆత్మహత్యలు మొదలయ్యాయి. ప్రత్యామ్నాయ ఉపాధి ఆర్థిక వనరులు వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. కులవృత్తుల్లో చేనేత పరిశ్రమ సంపూర్ణంగా అంతర్ధానమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో పద్మశాలీయులకు స్ఫూర్తినిచ్చే రాజకీయ అండదండలు మృగ్యం. ఎవరికి వారు తలోదారి వెతుక్కుంటూ బతుకుజీవుడా అంటూ రకరకాల వ్యాపార వ్యవహారాలలో చేరిపోతున్నారు.
దశాబ్ద కాలంగా మనుగడ లేదని వృత్తిపనిని యువతరానికి దూరంగా ఉంచుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేయించి ఉద్యోగాల దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.
భారతదేశ ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో కులవృత్తుల వారీగా రాజ్యాంగం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో పద్మశాలీయులు వెనకబడిన ‘వర్గ జాబితాలో ‘బి‘ గ్రూపులో 17వ సంఖ్యలో గుర్తింపబడ్డారు (బి.సి.బి.గ్రూపు 17)
పూర్వకాల పద్మశాలీ యులు మన దేశంలో శ్రీమంతులు. సంపన్నవర్గంగా గుర్తింపబడ్డారు. బ్రిటిష్ వారి రెండు వందల సంవత్సరాల నిరంతర పాలనలో చేనేత పరిశ్రమను సమూలంగా వినాశనం చేయడంతో సంపన్నులు కాస్త కూటికి లేని వారయ్యారు. దేశ స్వాతంత్య్రం నాటికి దారిద్య్ర రేఖకు దిగువన ఆదాయం గలవారుగా, బలహీన వర్గంగా గుర్తింప బడ్డారు.