నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు ఆచార్య రవ్వా శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్ లోని సీతారాంబాగ్లో కల సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివాడు. శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నాడు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడుగా చేశాడు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్గా 1967 లో పనిచేశాడు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించాడు.
